Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటి కష్టాలు తప్పేలా లేవు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై మహానగరానికి నీరందించే అన్ని సరస్సుల్లో నీటిమట్టాలు అట్టడుగు స్థాయికి చేరాయి. దీంతో జూలై 1 నుంచి 10 శాతం నీటి కోత విధించాలని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కమిషనర్ ఇక్బాల్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
Read Also: UK: సూర్యుడు అస్తమించని అగ్రరాజ్యం.. ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది..
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు వారాలు ఆలస్యంగా ముంబైకి చేరాయి. ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లోని భట్సా, అప్సర్ వైతర్ణ, మిడిల్ వైతర్ణ, తాన్సా, మోదక్ సాగర్, విహార్, తులసి ఈ ఏడు రిజర్వాయర్ల నుంచి ముంబైకి రోజుకు 3800 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుంది. అయితే ప్రస్తుతం రిజర్వాయర్లలో కేవలం 7.26 శాతం నీరు మాత్రమే ఉంది. దీంతో రానున్న కాలంలో ముంబైలో నీటి కోతలు తప్పేలా లేవు. నివేదిక ప్రకారం.. ఇదే సమయానికి 2022లో ఇదే సరస్సుల్లో 9.04 శాతం, 2021లో 16.44 శాతం నీటి నిల్వలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ముంబైకి రుతుపవనాలు చేరాయి. ఈ ఆదివారం నుంచి ముంబైని వర్షాలు పలకరించాయి. నగరంలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని బీఎంసీ వెల్లడించింది. ఇక వేళ వర్షాల విస్తారం కురిస్తే నీటి కోత నిర్ణయంలో మార్పు జరగొచ్చని తెలుస్తోంది.