NTV Telugu Site icon

Heavy rain: ముంబై, పూణెను ముంచెత్తిన కుండపోత వర్షం.. ప్రజా రవాణా అస్తవ్యస్తం

Mumbaiheavyrain

Mumbaiheavyrain

దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, దేవాలయాలు, కార్లు అన్ని నీటి మునిగాయి. ఇక ప్రజా రవాణా అస్తవ్యస్తం అయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న ఇళ్లల్లోంచి ప్రజలను సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ముంబైలోని సియోన్, చెంబూర్, అంధేరి వంటి ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో రెండు మోదక్-సాగర్ సరస్సు, విహార్ సరస్సులు పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ సరస్సుల సామర్థ్యాలు 12,892 కోట్ల లీటర్లు మరియు 2,769 కోట్ల లీటర్లు. ప్రస్తుతం రెండు సరస్సులు పొంగిపొర్లుతున్నందున ముంబైలోని నీటి సరఫరాలో 10 శాతం కోత విధించినట్లు పౌర సంఘం ప్రకటించింది.

ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు కూడా వర్షం కష్టాలతో అల్లాడిపోతున్నాయి. థానేలోని ముంబ్రా వంటి కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పూణెలో పింప్రి చింద్‌వాడ్‌లోని పలు నివాస సముదాయాలు జలమయమయ్యాయి. పూణెలో నీటి గుండా వెళుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు చనిపోయారు.

ఇదిలా ఉంటే తాజా పరిణామాలపై వాతావరణ శాఖ అప్రమత్తమైంది. శుక్రవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ఎవరు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. పూణెలోని పరిస్థితి గురించి మాట్లాడుతూ.. నగరంలోని అధికారులతో మాట్లాడానని, అవసరమైతే ప్రజలను ఎయిర్‌లిఫ్ట్ చేస్తానని షిండే చెప్పారు. సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)తో మాట్లాడినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ముందస్తు ప్రయాణాలు పెట్టుకున్న ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.