NTV Telugu Site icon

Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్

Mumbai

Mumbai

Mumbai Threat Case: ముంబైలో మళ్లీ 26/11 తరహా ఉగ్రదాడికి పాల్పడతామంటూ అగంతుకులు నుంచి బెదిరింపు సందేశాలు రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్‌ నంబరుకు పాకిస్థాన్‌ కోడ్ ఉండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం రాత్రి సెంట్రల్ ముంబయి పరిధి వర్లీలో ఉన్న ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సప్ నంబర్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సందేశానికి సంబంధించి ముంబై క్రైమ్‌ బ్రాంచ్ శనివారం అర్ధరాత్రి విరార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.

పాకిస్థాన్ ఆధారిత నంబర్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.భారత్‌లో ఆరుగురు వ్యక్తులు ఈ దాడిని అమలు చేస్తారని సందేశంలో పేర్కొన్నారు. ముంబై పోలీసులు తక్షణ ప్రాతిపదికన దర్యాప్తు ప్రారంభించారని, భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. నవంబర్ 26, 2008న ముంబై అంతటా పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా జరిపిన దాడి తరహాలో మళ్లీ దాడులు చేపడతామని ఈ సందేశంలో హెచ్చరించారు. 26/11 పేలుళ్ల ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌, ఇటీవల మృతిచెందిన అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీ పేర్లను సందేశాల్లో ప్రస్తావించారు. ఈ మెసేజ్‌లు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Extortion Scam: రూ.500 కోట్ల ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో గల హరిహరేశ్వర్ బీచ్‌లో ఏకే 47 రైఫిళ్లు, తుపాకులు, మందుగుండు సామగ్రితో కూడిన పడవ గురువారం లభ్యమైన అనంతరం భద్రతాపరమైన భయం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పడవ రికవరీ తరువాత మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆ పడవ ఆస్ట్రేలియా పౌరుడికి చెందినదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

నవంబర్ 26, 2008 న, పాకిస్తాన్ నుంచి 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి కాల్పులు జరిపారు.18 మంది భద్రతా సిబ్బందితో సహా వందలాది మంది మరణించారు. ముంబైలో అనేక మంది గాయపడ్డారు. దేశంలోని ఎలైట్ కమాండో దళం ఎన్‌ఎస్‌జీతో సహా తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు తరువాత హతమార్చాయి. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్. నాలుగేళ్ల తర్వాత నవంబర్ 21, 2012న అతన్ని ఉరితీశారు.