Site icon NTV Telugu

నవనీత్‌ కౌర్‌కు హైకోర్టు షాక్‌.. రూ.2 లక్షల జరిమానా కూడా..

Navneet Kaur

Navneet Kaur

తొలిసారి ఎంపీగా విజయం సాధించారు ప్రముఖ నటి నవనీత్‌ కౌర్ రాణా… మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె.. లోక్‌సభలో అడుగుపెట్టారు.. అయితే, ఆమెకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసులో బాంబే హైకోర్టు షాకిచ్చింది… కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆమెకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.. కాగా, తెలుగు సినిమాల్లోనూ నటించిన నవనీత్‌ కౌర్ అందరికీ సుపరిచితురాలు.. 35 ఏళ్ల ఈ యువ ఎంపీ.. ఏకంగా ఏడు బాషలు మాట్లాడగలరు.. ఇక, మార్చిలో ఆమె చేసిన కామెంట్లు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్‌సభ లాబీలో బెదిరించారని ఆరోపించారు.. మహారాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తనకు జైలు తప్పదని వ్యాఖ్యానించారని మీడియాకు వెళ్లడించారు.. అంతేకాదు.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సైతం ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. తనను ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని.. తనపై యాసిడ్ దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మరోవైపు.. నవనీత్ కౌర్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అడ్సల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె విజయం సాధించిన అమరావతి లోక్‌సభ స్థానం ఎస్సీలకు రిజర్వు కాగా.. ఫేక్‌ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, ఈ స్థానం నుంచి పోటీ చేశారని కోర్టును ఆశ్రయించారు.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు నిర్ధారించింది.. దానిని రద్దు చేస్తూ, రూ.2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. మరో 6 వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది బాంబే హైకోర్టు.. ఈ పరిణామాలతో నవనీత్‌ కౌర్ ఎంపీ పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.. అయితే, పదవి విషయంపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version