NTV Telugu Site icon

Maharashtra: ఔరంగాబాద్ ఎంపీ ఆవేదన.. పేరు మార్చడం కోసం రూ.వెయ్యి కోట్లు తగలేస్తారా?

Aurangabad

Aurangabad

ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం దిగిపోయేముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని డాక్యుమెంట్లలో, బోర్డుల మీద ఔరంగాబాద్ పేరును మార్చాల్సి ఉంటుంది. తాజాగా ఈ అంశంపై ఔరంగాబాద్ ఎంపీ, AIMIM పార్టీ నేత ఇంతియాజ్ జలీల్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా థాక్రే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. సాధారణంగా చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఇటీవల ఓ నివేదిక చదివి తెలుసుకున్నానని.. ఔరంగాబాద్ వంటి పట్టణానికి అయితే పేరు మార్పు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని ఢిల్లీ అధికారి చెప్పారని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక

ఊరి పేరు మార్చడం వల్ల ప్రభుత్వ డాక్యుమెంట్లు, ఉత్తర, ప్రత్యుత్తరాల పేరు మార్పు కోసం రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇదంతా ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇందులో తన డబ్బు కూడా ఉంటుందన్నారు. అటు కొత్త పేరు వల్ల ప్రజలు ఇక్కట్లకు గురవుతారని ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. ఇది మతానికి సంబంధించిన ఆవేదన కాదన్నారు. ఉదాహరణకు తనకు ఓ షాపు ఉంటే ఇప్పుడు పేరు మార్పుతో షాపుకు సంబంధించిన డాక్యుమెంట్‌ కూడా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. దీని కోసం కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని… ఇందుకోసం ఎవరికి వారే క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. ఉద్ధవ్ థాక్రే లేదా శరద్ పవార్ లేదా మరో నేత వచ్చి ప్రజలకు సాయం చేయరన్నారు. సామాన్య ప్రజలకు ఈ ప్రక్రియ ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించాలన్నారు.