NTV Telugu Site icon

Video: కలెక్టరేట్‌లో వృద్ధ అన్నదాత పొర్లు దండాలు.. కళ్లప్పగించి చూసిన అధికారులు..!

Mpfarmar

Mpfarmar

అన్నదాతా సుఖీభవ.. అన్నదాత విజయీభవ అంటారు పెద్దలు. కర్షకుడు.. ఆరుగాలం కష్టపడి.. పండిస్తే.. ప్రజలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అందుకే రైతేరాజు అన్నారు. అలాంటి అన్నదాతకు కష్టం వస్తే.. కనికరించే నాథుడే లేకుండా పోయాడు. తనకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్‌కు వచ్చి పొర్లు దండాలు పెట్టినా.. పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

తన భూమిని ల్యాండ్ మాఫియా కాజేశారని… వారి నుంచి కాపాడి తనకు ఇప్పించాలని ఓ వృద్ధ రైతు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినప్పటికీ వారిలో చలనం లేకపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపాడు. చేతులు జోడించి కలెక్టరేట్ ఆఫీస్ నేలపై దొర్లుతూ పొర్లు దండాలు పెట్టాడు. ఆ సమయంలోనూ అధికారులు.. అలా చేశారే తప్ప.. ఆపే ప్రయత్నమూ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో పొర్లు దండాలు పెడుతున్న రైతు పేరు.. శంకర్‌లాల్‌(65). ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించుకుందంట. వారి నుంచి దానిని తిరిగి తనకు ఇప్పించాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారుల్లో చలనం రాకపోవడంతో పొర్లు దండాలతో ‘న్యాయం చేయండి ప్రభో’ అంటూ వేడుకున్నాడు. మందసౌర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు శంకర్‌లాల్‌ ఆరోపించారు. తన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన రాలేదని రైతు శంకర్‌లాల్‌ వాపోయాడు. ఇదిలా ఉంటే వివాదాస్పద భూమి శంకర్‌లాల్ ఆధీనంలోనే ఉందని స్థానిక యంత్రాంగం అంటుంది.