MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో డానిష్ అలీ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై రమేష్ బిధూరి మతపరమైన వివక్ష, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ డానిష్ అలీ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే తమ డానిష్ అలీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే బహిష్కరణకు కారణమని పార్టీ పేర్కొంది. ‘‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు మరియు క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రకటనలు లేదా చర్యలకు వ్యతిరేకంగా మీరు చాలాసార్లు హెచ్చరించబడ్డారు. అయితే, మీరు నిరంతరం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు’’అని బీఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొంది.
డానిష్ అలీ, రమేష్ బిధూరి వివాదం నేపథ్యంలో డానిష్ అలీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు మద్దతు పలికారు. తాజాగా క్యాష్ ఫర్ క్వేరీ కేసులో పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురైన మహువా మోయిత్రాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా నిన్న పార్లమెంట్ వెలుపల నిరసన తెలియజేశారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు రమేష్ బిధూరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వాళ్లు మహువా మోయిత్రాపై చర్యలు తీసుకున్నారని, ఈ రోజు మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఏడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చంద్రయాన్-3 మిషన్‌పై చర్చ సందర్భంగా బిధురి చేసిన వ్యాఖ్యలపై భారీ రాజకీయ దుమారం చెలరేగింది. దక్షిణ ఢిల్లీ ఎంపీని రెచ్చగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే పదాలను ఉపయోగించారని పలువురు బీజేపీ నేతలు, డానిష్ అలీపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి, డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే రమేష్ బిధూరి తన వ్యాఖ్యలపై గురువారం జరిగిన లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశంలో విచారం వ్యక్తం చేశారు.
జేడీయూలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన డానిష్ అలీ 2019లో బీఎస్పీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి దాదాపుగా 63,000 ఓట్ల తేడాతో బీజేపీ నేత కన్వర్ సింగ్ తన్వర్‌పై విజయం సాధించారు.