Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..

  • గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో పుల్వామా సూత్రధారి హతం..
  • హమ్జా బుర్హాన్ అంతక్రియల్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..
Pakistan

Pakistan

Pakistan: ప్రపంచంలో ఉగ్రవాదుల స్వర్గధామం అంటే వెంటనే గుర్తుకు వచ్చే దేశం ‘‘పాకిస్తాన్’’. ఆ దేశ సైన్యం, ప్రభుత్వాలే ఉగ్రవాదుల్ని పెంచిపోషిస్తుంది. చాలా సార్లు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ పాక్ తమ దేశంలో ఉగ్రవాదులు లేరని, తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని కబుర్లు చెబుతుంది. కానీ, ఇప్పుడు ‘‘గుర్తుతెలియని వ్యక్తుల’’ దాడులతో కీలక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా అజ్ఞాత వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారు.

ఇటీవల, పుల్వామా సూత్రధారుల్లో ఒకరైన అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది హమ్జా బుర్హాన్‌ను పాకిస్తాన్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే)లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ముజఫరాబాద్‌లో ఒక కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈ ఉగ్రవాదిని కాలేజీ బయట హతమార్చారు. తలలో మూడు బుల్లెట్లను దించడంతో అతను అక్కడిక్కడే మరణించారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని రత్నిపోరాకు చెందిన హమ్జా, పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. 2019లో పుల్వామా దాడిలో కీలకంగా వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్‌లో ఇతడి అంతక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయితే, ఈ కార్యక్రమంలో పలువురు ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు హాజరైనట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ అధిపతి సయ్యద్ సల్లాహుద్దీన్, అల్-బదర్ అధిపతి బఖ్త్ జమీన్ ఖాన్‌ హాజరయ్యారు. వీరిద్దరికి పాకిస్తాన్ కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ఏకే-47లతో భద్రతా సిబ్బంది సెక్యూరిటీ ఇచ్చింది. కొద్ది వారాల క్రితం పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌కు సన్నిహితుడైన వ్యక్తి, 26/11 ముంబై దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌తో ఒకే వేదికపై కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.