NTV Telugu Site icon

Summer Season: దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న ఎండలు.. సాధారణం కన్నా అధికం.. ఐఎండీ హెచ్చరిక

Summer Season

Summer Season

India To Witness Above-Normal Temperatures From April To June: మార్చి చివర నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎండాకాలంపై కీలక సమాచారాన్ని తెలిపింది. ఈ సారి ఎండాకాలం మండేకాలంగా ఉండబోతోందని వెల్లడించింది. భారత్ చాలా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉండనున్నట్లు తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాననున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ కాలంలో తూర్పు, వాయువ్య భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువగా వడగాలుల ప్రభావం ఉండబోతోందని అంచానా వేసింది.

Read Also: CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు

ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వడగాలల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, వాయువ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక మిగతా దేశంలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

ఈశాన్య, వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతంలోని వివిక్త ప్రాంతాలను మినహాయించి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో తెలిపింది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని, తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.