NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ వీధిలో ఆలయం..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. ఆ దేశంలో 96 శాతం మంది ముస్లింలే, కేవలం 1-2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ విభజన సమయంలో 20 శాతం వరకు ఉన్న హిందువులు, అణిచివేత కారణంగా కేవలం సింగిల్ డిజిట్‌కి పరిమితమయ్యారు. హిందువులపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. బాలికలు, మహిళల్ని బలవంతంగా అపహరించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ యొక్క 2023 జనాభా లెక్కల ప్రకారం, 2023 సంవత్సరంలో పాకిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 24 కోట్ల 04 లక్షల 58 వేల 089. ఈ మొత్తం జనాభాలో ముస్లింల వాటా దాదాపు 96.35 శాతం. అయితే 2023 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్ మొత్తంలో హిందువుల జనాభా కేవలం 1.61 శాతం మాత్రమే.

80 శాతం హిందూ జనాభా..

అయితే, ఇలాంటి పాకిస్తాన్‌లో ఒక్క నగరంలో మాత్రం హిందువుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నగరంలోనే 80 శాతం హిందూ జనాభా ఉంది. ఆ నగరం పేరు ‘‘మిఠీ’’. పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్సులోని థార్‌పార్కర్ జిల్లాలో ఉంది. ఇది జిల్లా హెడ్‌క్వార్టర్. పూర్తిగా ఎడారి ప్రాంతంలోని మట్టిదిబ్బల మధ్య నగరం నెలకొని ఉంది. కరాచీ నుంచి దాదాపుగా 5-6 గంటల దూరంలో ఈ మిథి నగరం ఉంది. భారత్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

మిఠిలో హిందువుల ఆధిపత్యం..

పాకిస్తాన్ లోని అన్ని ప్రాంతాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటే, మిఠిలో మాత్రం హిందువుల రాజ్యమే నడుస్తుంది. దీనిని మిని హిందూస్తాన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ నగరంలో ప్రతీ వీధిలో ఆలయం ఉంటుంది. ప్రతీ ఇంటిపై ఓం, స్వస్తిక్ చిహ్నాలతో పాటు జైశ్రీరాం వంటి నినాదాలు కనిపిస్తుంటాయి. దీపావళి, హోళీ లాంటి పండగలు ఘనంగా జరుపుకుంటారు. జగదీష్ కాలనీ అంటూ ప్రతీ వీధి కూడా హిందూ మతాన్ని సూచిస్తుంది. ఈ మిథిలోని చాలా వరకు వ్యాపారం, దుకాణాలు హిందువుల చేతుల్లోనే ఉంటాయి.

గోవధపై నిషేధం:

పాక్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఒక్క ప్రాంతంలోనే పశువధపై నిషేధం ఉంది. ప్రతీ హిందూ కుటుంబం కూడా ఆవుల్ని పెంచుకుంటుంది. వీధుల్లో ఆవులు, పశువులు స్వేచ్ఛగా తిరుగుతుండటం చూడొచ్చు. ఇక్కడ నివసించే ముస్లింలు కూడా గోమాంసం తినరు. ఇరువర్గాలు కూడా కలిసి మెలిసి ఉంటాయి. ఒకరి పండగల్లో ఒకరు భాగమవుతారు.