Site icon NTV Telugu

Heavy Rains: భారీ వ‌ర్షాలకు 145 మందికి పైగా మృతి.. ఉత్తర భార‌తం అతలాకుతలం

Heavy Rains

Heavy Rains

Heavy Rains: నైరుతు రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా 145 మందికిపైగా మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారతదేశంలోని ప‌లు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాలు, వరదల కారణంగా పలువురు నిరశ్రయులయ్యారు. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అప్రమ‌త్తమైన అధికారులు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజ‌ల‌ను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లిస్తున్నారు. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని ఉత్తర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారతదేశంలో ఇప్పటివరకు వందకుపైగా మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల బీభత్సానికి జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో వర్షాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 91కి చేరింది. ఇంకా 14 మంది గల్లంతయ్యారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. కొండ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం, రహదారులు మూసుకుపోవడం, వంతెనలు కొట్టుకుపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని తెలిపారు.

Read also: MLA Rajasingh: హరీష్ రావును అందుకే కలిసాను.. రాజాసింగ్‌ కీలక వాఖ్యలు

ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 19 వరకు వర్షాభావ పరిస్థితులను అంచనా వేసింది. 636 ఇళ్లు పూర్తిగా, మరో 1,128 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,110 రహదారులు దిగ్బంధం అయ్యాయని స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ కు రూ.2,108 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే సుమారు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి అంచనా వేశారు. ఇదిలావుండగా, హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని సాంగ్లా పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక సిబ్బంది గురువారం లాహౌల్, స్పితిలోని చంద్రతాల్ వద్ద చిక్కుకుపోయిన 256 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెరుగుతున్న యమునా జలాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో యమునా నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరగడంతో రోడ్లు నదులుగా మారి ఇళ్లు, వైద్య సదుపాయాలు, శ్మశానవాటికలు, షెల్టర్ హోమ్ లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న నది రోడ్లను వాగులుగా మార్చేయగా.. పార్కులన్నీ జలమయంగా మారాయి.. ఇళ్లు, షెల్టర్లు వరద నీటితో మునిగిపోయాయి.

Exit mobile version