Site icon NTV Telugu

Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా.. వెంకయ్యకు ఘన వీడ్కోలు

Parliament Monsoon Session Adjourned

Parliament Monsoon Session Adjourned

Parliament Monsoon Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే ఈ రోజే పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. చివరి రోజున ఆర్బిట్రేషన్ బిల్లు, ఇంధన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభ ఆమోదంతో గతిశక్తి బిల్లు పార్లమెంటు గడప దాటింది. ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర ముఖ్య నేతలు హాజరైన సభలో వీడ్కోలు పలికారు. నాయుడు బుధవారం పదవీ విరమణ చేయనుండగా.. ఆయన వారసుడు జగదీప్ ధన్‌కర్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వర్షాకాల సమావేశాలు అనేక కీలక ఘట్టాలకు వేదికయ్యాయి. నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఈ సమావేశాల్లోనే సభ్యులు ఎన్నుకున్నారు. ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం వంటి అంశాలపై విపక్షాల నిరసనలతో.. ఉభయసభలు హోరెత్తాయి. ధరల పెరుగుదలపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ జరిపింది ప్రభుత్వం. కొన్ని కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంది.

Venkaiah Naidu: రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం

రాజ్యస‌భలో 16 రోజులు సిట్టింగ్స్ జ‌రిగాయ‌ని, ఆ స‌మ‌యంలో 38 గంట‌ల పాటు కార్యక్రమాలు నిర్వహించిన‌ట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంక‌య్యనాయుడు వెల్లడించారు. కానీ విప‌క్షాల ఆందోళ‌న వ‌ల్ల 48 గంట‌ల స‌భా స‌మ‌యం వృథా అయిన‌ట్లు వెంకయ్య చెప్పారు. ఈ సారి కేవ‌లం 5 ప్రభుత్వ బిల్లులు మాత్రమే స‌భ ఆమోదం పొందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 27 ప్రైవేటు మెంబ‌ర్స్ బిల్లుల‌ను ప్రవేశ‌పెట్టినా.. కేవ‌లం ఆరోగ్య హ‌క్కు బిల్లు గురించి మాత్రమే చ‌ర్చ జ‌రిగిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. లోక్‌స‌భ స‌మావేశాల‌ను కూడా నాలుగు రోజులు ముందుగానే వాయిదా వేశారు. 44 గంట‌ల 29 నిమిషాల పాటు స‌భా కార్యక్రమాలు జ‌రిగిన‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.

Exit mobile version