Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఈ రోజు వెల్లడించింది. జూన్ 4 నాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. సాధారణంగా ఏడు రోజులకు అటుఇటుగా జూన్ 1 న కేరళలోకి ప్రవేశిస్తాయి.
Read Also: Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా..? అయితే ఇలా ఆన్‌లైన్ నుంచి పొందండి..
నైరుతి రుతుపవనాలు గతేడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది జూన్ 4న భారత్ లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. గత 18 ఏళ్లుగా (2005-2022) ఐఎండీ రుతుపవనాలకు సంబంధించిన అంచానాలను రూపొందిస్తోంది. అయితే 2015 లో తప్పితే అన్ని సందర్భాల్లో ఈ అంచనాలు రుజువయ్యాయి. దేశంలో నైరుతి రుతుపవనాలు మొదటగా కేరళలోకి ప్రవేశిస్తాయి. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి రుతుపవనాలు ఎప్పుడు వ్యాపిస్తాయో ఐఎండీ వెల్లడించలేదు.
దేశంలో వర్షపాతానికి ముఖ్యంగా రుతుపవన వ్యవస్థే కీలకం. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల దేశంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు సంభవిస్తాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దేశంలోని వ్యవసాయం ఆధారపడి ఉంది. అందుకు భారతదేశంలో వ్యవసాయాన్ని రుతుపవానాలతో ‘జూదం’గా పోలుస్తుంటారు. కాగా.. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ఎఫెక్ట్ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ గత నెలలో అంచనా వేసింది.