Amit Shah: రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇది మోడీ హామీ అని చెప్పారు. ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అని పిలుపునిస్తోందని, ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల తరుపున ఆదివారం ఆయన ప్రచారం చేవారు.
బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తమకు రెండు పర్యాయాలు పూర్తి మెజారిటీ ఉందని అయినా కూడా రిజర్వేషన్లను తాము ముట్టుకోలేదని, పీఎం మోడీ రిజర్వేషన్లకు మద్దతుగా ఉన్నారని, ఎలాంటి రిజర్వేషన్లు తొలగించమని మోడీ హామీ ఇస్తున్నారని అమిత్ షా అన్నారు. కరసేవకులను చంపిన వారికి, రామ మందిరాన్ని నిర్మించినవారిని ప్రజలు ఎంచుకోవాలని కోరారు.
Read Also: Tornadoes: అమెరికాలో విధ్వసం సృష్టిస్తున్న టోర్నడోలు.. వీడియో వైరల్..
రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడాన్ని అమిత్ షా ప్రస్తావించారు. కాంగ్రెస్, రాహుల్ బాబా, అఖిలేష్ యాదవ్ పార్టీ 70 ఏళ్లకు పైగా రామాలయాన్ని అడ్డుకుందని, మీరు మోడీని రెండోసారి ప్రధానిని చేశారు, అయోధ్య రామ మందిరం నిర్మితమైందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్ పురిలో ఆయన బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ ఠాకూర్ కోసం ప్రచారం చేశారు. ‘‘ అఖిలేష్ జీ, డింపుల్ జీ ఎవరి భయం వల్ల మీరు రామ మందిరా శంకుస్థాపనకు వెళ్లలేదు?? ప్రజలు వెళ్లడం లేదా..?తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు వేడుకలకు హాజరు కాలేదు’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. కానీ బీజేపీ ఓటు బ్యాంకులకు భయపడటం లేదు, శ్రీరాముడు జన్మించిన చోట మేం ఆలయాన్ని నిర్మించామని అన్నారు.
ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరని ప్రశ్నించారు. 23 ఏళ్లుగా ముఖ్యమంత్రి, 10 ఏళ్లు ప్రధానిగా, ఎలాంటి ఆరోపణలు లేని నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారని అన్నారు. ఒక వైపు వేసవిలో థాయ్‌లాండ్ విహారయాత్రలకు వెళ్లే రాహుల్ గాంధీ ఉన్నారని అమిత్ షా అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకు కోసమే పరిరక్షిస్తున్నాయని ఆరోపించాయని అన్నారు. పేదలకు ఉచిత రేషన్ మరియు ఇళ్లతో సహా బిజెపి ప్రభుత్వ పథకాలను గురించి చెప్పిన షా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ పథకం 2029 వరకు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.