Site icon NTV Telugu

Amit Shah: 19 ఏళ్లు మోదీ మౌనంగా వేదన అనుభవించారు..

Amits Shah About Pm Modi

Amits Shah About Pm Modi

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 19 ఏళ్ల పాటు మోదీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని.. శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్లుగా ఆయన ఈ వేదనను అనుభవించారని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను నిన్న సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

మోదీ తనపై వచ్చిన ఆరోపణలపై 19 ఏళ్లపాటు ఒక్క మాట మాట్లాడలేదని కేంద్ర మంత్రి అమిత్‌షా అన్నారు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్లుగా ఆ బాధను భరించారన్నారు. ఆ వేదనను తాను ఎంతో దగ్గరగా చూశానని ఆయన తెలిపారు. ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆయన ఒక్క మాట మాట్లాడలేదని.. ఎంతో దృఢ సంకల్పం కలిగి ఉంటేనే అలా నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం అంటూ మోదీ తీరును అభినందించారు. కొందరు కావాలనే మోదీపై దుష్ప్రచారం చేశారని ఆయన అన్నారు. కానీ ఆయన ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారని.. గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీం క్లీన్‌చిట్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. సిట్ విచారణను తాము ప్రభావితం చేయలేదన్న ఆయన… సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందన్నారు. ఈ కేసు భాజపా ప్రతిష్ఠను దెబ్బతీసిందని.. కానీ ఇప్పుడదంతా తొలగిపోయిందని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న తీరును ఆయన నిరసించారు. సిట్ ముందు హాజరయ్యేప్పుడు మోదీ ఎలాంటి హడావిడి చేయలేదని.. కానీ ఇప్పుడు రాహుల్‌కు మద్దతుదా కేంద్రంపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారని అన్నారు.

అసలేం జరిగిందంటే..: 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ జకియా పలుకోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది.

ప్రధాని మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించగా.. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Exit mobile version