ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. శనివారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది. పార్లమెంట్‌లో కీలక బిల్లులు వీగిపోయిన సందర్భంగా కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు విపక్షాల తీరుకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలు నిరసన తెల్పాలని డిసైడ్ అయ్యారు.
