NTV Telugu Site icon

Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్‌లో ఇంటర్నెట్ బంద్..

Haryana

Haryana

Haryana: గతేడాది హర్యానా నుహ్ ప్రాంతంలో భారీగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రకు ముందు నుహ్ జిల్లాలోని ఇంటర్నెట్‌ని, బల్క్ ఎస్ఎంఎస్‌ సేవల్ని 24 గంటల పాటు నిలిపేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపేయబడుతాయని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) అనురాగ్ రస్తోగి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Uttarakhand HC: భార్యతో బలవంతంగా అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను శిక్షించొచ్చా..? హైకోర్టు ఏం చెప్పిందంటే..

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుదు సమాచారం, పుకార్లను వ్యాప్తిని ఆపేందుకు ఈ సేవల్ని నిలిపేసినట్లు చెప్పారు. యాత్ర సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నుహ్ పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న హర్యానా నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఒక గుంపు దాడికి పాల్పడింది. రాళ్లు, కత్తులు, తుపాకులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడగా, ఇద్దరు హోం గార్డులు మరణించారు. అదే రాత్రి గురుగ్రామ్‌లోని మసీదుపైమ మరో గుంపు దాడి చేసింది. మత ఘర్షణల్లో కనీసం ఐదుగురు మరణించారు.