Site icon NTV Telugu

Tax on Mobile Data : మొబైల్ డేటాపై కొత్త పన్ను..! ఒక్క జీబీ డేటాపై ఎంత చెల్లించాలంటే..?

Tax On Mobile Data

Tax On Mobile Data

Tax on Mobile Data : జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక రకాల పన్నులను ప్రజలు చెల్లించాల్సిన పరిస్థితి.. ఎంతలా అంటే.. ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు నుంచి వినియోగం వరకు వివిధ దశల్లో పన్నుల భారం మోయాల్సిన పరిస్థితి.. ఇక, ఇప్పుడు.. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం భవిష్యత్తులో మరింత ఖరీదైనదిగా మారే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం ఈ విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని (DoT) ను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

ప్రతి GB డేటాకు రూ.1 పన్ను ప్రతిపాదన
మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పరిశీలిస్తున్న ఒక ప్రతిపాదన ప్రకారం ప్రతి జీబీ మొబైల్ డేటా వినియోగంపై రూ.1 పన్ను విధించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే వినియోగదారులు ఉపయోగించే డేటా పరిమాణానికి అనుగుణంగా అదనపు ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు. అంచనాల ప్రకారం ప్రతి GB డేటాపై రూ.1 పన్ను అమలు చేస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.22,900 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇప్పటికే 18 శాతం GST
ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్‌లు మరియు పోస్ట్‌పెయిడ్ బిల్లులపై 18 శాతం Goods and Services Tax (GST) అమలులో ఉంది. అంటే టెలికాం సేవలపై వినియోగదారులు ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్నారు. డేటాపై ప్రత్యేక పన్ను అమలు చేస్తే అది ఇప్పటికే ఉన్న పన్నులకు అదనంగా ఉండే అవకాశం ఉంది.. ప్రపంచంలో చౌకైన మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. తక్కువ ధరల కారణంగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్, రీల్స్ వంటి కారణాలతో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోంది.

తుది నిర్ణయం..!
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై అధ్యయనం మాత్రమే జరుగుతోంది. దాని లాభనష్టాలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియా వేదికలలో, ముఖ్యంగా Reddit వంటి ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. చాలా మంది ఈ న్యూస్‌ను షేర్‌ చేస్తున్నారు.. ఉదాహరణకు.. అన్ని టెలికం సంస్థలు.. 1 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ ఇలా రోజువారి డేటాతో.. 28 డేస్‌, 54 డేస్, 98 డేస్.. ఇలా ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి.. అంటే, ఈ డేటా ట్యాక్స్‌ అమల్లోకి వస్తే మాత్రం.. ప్రతి రోజు 1 జీబీ డేటా అంటే.. మీ రీఛార్జ్‌ ప్లాన్‌ను బట్టి.. ప్రతి రోజుకు రూపాయి అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి.. 1.5 జీబీ అయితే రూ.1.50 పైసలు ప్రతిరోజు అదనంగా చెల్లించాల్సిన అవసరం రానుండగా.. 2 జీబీ డేటాపై ప్రతి రోజుకు అదనంగా రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.. అంటే మీ ప్లాన్‌ బట్టి.. అదనంగా డబ్బులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.. ఇది అధ్యయన దశలోనే ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

Exit mobile version