NTV Telugu Site icon

Ambedkar remark: “అంబేద్కర్ వ్యాఖ్యల”పై అమిత్ షాకి వ్యతిరేకంగా డీఎంకే తీర్మానం..

Amit Shah

Amit Shah

Ambedkar remark: రాజ్యాంగంపై చర్య సందర్భంగా రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘‘అంబేద్కర్’’పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌తో పాటు దాని మిత్ర పక్షాలు, ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరిస్తోందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ తన జీవితంలో ఎప్పుడూ కూడా అంబేద్కర్‌ని గౌరవించలేదని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.

Read Also: Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్‌కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన డీఎంకే కార్గవర్గ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్‌లో బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు. హోంమంత్రి ప్రసంగం నుండి దృష్టి మరల్చేందుకు పార్లమెంటు లోపల మరియు వెలుపల బిజెపి ప్రదర్శించిన డ్రామా చాలా హాస్యాస్పదంగా ఉందని కార్యనిర్వాహక కమిటీ అభిప్రాయపడింది’’ అని తీర్మానంలో పేర్కొంది.

డిసెంబర్ 17న అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది. అయితే, ఈ స్పీచ్‌లోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నేతలు షేర్ చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే, అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ సమర్థించారు. అంబేద్కర్‌ని అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను హోంమంత్రి బయటపెట్టారని అన్నారు.