Missile Attack on LPG Tanker: హార్మూజ్‌ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!

Hormuz Strait Crisis

Hormuz Strait Crisis

Missile Attack on LPG Tanker: హార్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, హార్మూజ్‌ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 24 మంది భారతీయ నావికులు ఉన్న ఎల్పీజీ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.. నవంబర్ 16వ తేదీన పనామా జెండాతో ప్రయాణిస్తున్న ‘తారా గ్యాస్’ అనే ఎల్పీజీ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. అయితే, దాడి జరిగినప్పటికీ నౌకలోని భారతీయ పౌరులంతా సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారి భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నౌకను నిర్వహిస్తున్న యాజమాన్య సంస్థతో కూడా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో హార్మూజ్‌ జలసంధి ఒకటి. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో ముడి చమురు, సహజ వాయువు రవాణా జరుగుతుంది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలకు ఈ జలసంధి ఎంతో కీలకం. ఇలాంటి ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. సముద్ర భద్రతతో పాటు ఇంధన సరఫరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా 24 మంది భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరగడంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది. అయితే, వారంతా క్షేమంగా ఉన్నారని కేంద్రం వెల్లడించడం ఊరటనిచ్చే అంశంగా మారింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నౌకా యాజమాన్య సంస్థతో సమన్వయం చేసుకుంటున్నారు.