మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో పాపులర్ డైలాగ్ మీకు గుర్తుందా? మొక్కే కదా పీకితే పీకకోస్తా అంటాడు చిరంజీవి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. తన పొలంలోని మొక్కను పీకినందుకు 7 ఏళ్ల బాలుడిని 12 ఏళ్ల బాలుడు చంపేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా షేక్‌పూర్ గ్రామంలో జనవరి 26న 12 ఏళ్ల బాలుడు తన పొలాన్ని పర్యవేక్షిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు తన పొలంలో ఓ మొక్క పీకుతూ కనిపించాడు.
Read Also: కరోనా నుంచి కోలుకున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్
దీంతో 12 ఏళ్ల బాలుడు కోపంతో ఊగిపోయాడు. అక్కడ కనిపించిన ఓ కర్ర తీసుకుని ఏడేళ్ల బాలుడిని స్పృహ తప్పేలా కొట్టాడు. దీంతో ఏడేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భయంతో బాలుడి గుండె ఆగిపోవడంతోనే మృతిచెందాడని పోస్టుమార్టంలో వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో తాము విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన వ్యక్తి మైనర్ కావడంతో అతడి కేసు నమోదు చేశామని తెలిపారు.
