NTV Telugu Site icon

Mini-Moon: చంద్రుడికి మినీ-చంద్రుడు తోడు..‘‘మహాభారతం’’తో సంబంధం.. 2 నెలలు భూమి చుట్టూ భ్రమణం..

2024 Pt5

2024 Pt5

Mini-Moon: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడికి మరో మినీ-చంద్రుడు తోడు కాబోతున్నాడు. 53 రోజలు పాటు గ్రహ శకలం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది కంటికి కనిపించదని ఇస్రో నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) హెడ్ డాక్టర్ ఎకె అనిల్ కుమార్ తెలిపారు. 2024 PT5 అని పిలువబడే మినీ-మూన్, వ్యాసంలో కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఇది మన సాధారణ చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నదని చెప్పారు. చంద్రుడి వ్యాసం 3476 కిలోమీటర్లు. కాబట్టి ఈ చిన్న చంద్రుడు కంటికి కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.

ఇస్రో 2024 PT5 యొక్క కదలికను నిశితంగా ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు. మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమించి, ఆ తర్వాత సౌర మండలంలో సుదూర తీరాలకు వెళ్తుంది. సెప్టెంబర్ 29 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరుగుతుంది.

Read Also: Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్‌దే..

భూమికి సమీపంలో వస్తువుల్ని పర్యవేక్షించడానికి నాసా వ్యవస్థ అయిన ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (ATLAS) ద్వారా ఆగష్టు 7న ఈ గ్రహశకలం కనుగొనబడింది. అయితే, ఈ గ్రహశకలానికి హిందూ ఇతిహాసం ‘మహాభారతం’తో సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (RNAAS) యొక్క రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో, ఖగోళ శాస్త్రవేత్తలు 2024 PT5 యొక్క కక్ష్య లక్షణాలు ‘‘అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్’’ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు. NETRAకి చెందిన పరిశోధకుడు డాక్టర్ అనిల్ కుమార్‌ కూడా 24 PT5 అర్జున గ్రహశకలం సమూహంలో భాగమని ధృవీకరించారు.

అర్జున అనేది సౌరవ్యవస్థలోని గ్రహశకలాల ప్రత్యేక సమూహం . ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్. మెక్‌నాట్ 1991 నవంబర్ 1న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో ‘1991 VG’ అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్‌కి మహాభారతంలోని ప్రముఖ పాత్ర ‘అర్జున’ పేరుని పెట్టారు. దీనిని అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) అధికారికంగా ఆమోదించింది. హిందూ పురాణాల్లో అర్జునుడు తన ధైర్యసాహసాలకు, అసమానమైన విలువిద్య నైపుణ్యాలకు, జ్ఞానానికి ప్రసిద్ధి. అర్జునుడి బాణాల లాగే సౌరవ్యవస్థలో దూసుకెళ్లే లక్షణం కలిగిన గ్రహశకలాలకు ఉంది. అందుకే ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. భూమి చుట్టూ చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకుముందు 1997, 2013 మరియు 2018లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.

Show comments