Military chopper crashes in Arunachal Pradesh: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మిలిటరీ హెలికాప్టర్ కూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బందిని ఘటన జరిగిన ప్రదేశానికి పంపారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఇంకా ఏ వివరాలు తెలియవని ఎగువ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు.
Read Also: Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ పనులకు కాస్త ఆటంకం కలుగుతున్నాయి. హెలికాప్టర్ కూలిన ప్రదేశం జిల్లా కేంద్ర యింగ్ కియాంగ్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రాష్ సైట్ కు చేరుకునేందుకే రెస్క్యూ బృందాలకు గంటల సమయం పట్టనుంది. వారు క్రాష్ సైట్ కు చేరుకున్న తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయని అప్పర్ సియాంగ్ జిల్లా ఎస్పీ జుమ్మర్ బసర్ తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఇలాగే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత ఆర్మీ పైలెట్ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. చైనాకు సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. 2010 నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఆరు హెలికాప్టర్ ప్రమాదాల్లో మాజీ సీఎం దోర్జీ ఖండూ తో సహా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయి. ఈ అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ క్రాష్ కు రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిపోయి పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న సమయంలో చాపర్ ప్రమాదానికి గురైంది.
