ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగి. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అదే సహోద్యోగులకు రుచించలేదు. నిత్యం ఆమెకు నరకం చూపించారు. క్షణం.. క్షణం కుమిలిపోయింది. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. ఇక టర్చర్ భరించలేక.. ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన నోయిడా యాక్సిస్ బ్యాంక్‌లో చోటుచేసుకుంది.
27 ఏళ్ల శివాని త్యాగి నోయిడాలో యాక్సిస్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుంది. అయితే ఆమె సహోద్యోగులు పనిగట్టుకుని తీవ్ర వేధింపులకు గురి చేశారు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శివాని ప్రాణం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
2023, అక్టోబర్‌లో శివాని కంపెనీలో చేరింది. శివాని శాకాహారిని.. కానీ తోటి ఉద్యోగి జ్యోతి.. మధ్యాహ్న భోజనంలో మాంసాహారం కలిపేది. దీంతో ఆమె ఒంటరిగా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె రాజీనామా చేసినా ఆమోదించలేదు. ఇక ఇంట్లోనే ఒంటరిగా ఏడూస్తూ ఉండేదని బాధితురాలి సోదరుడు తెలిపాడు. పలుమార్లు కొట్టడం.. జుట్టు పట్టుకుని లాకడం.. వ్యక్తిగత ఖాతాలోంచి డబ్బులు కూడా తీసుకున్నారని వాపోయాడు. పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. ఆ బాధలు భరించలేక ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది.
ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.