Medical Negligence: కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల బాలిక చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్‌ని నాలుకకు చేశారు. బాలిక బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి చేతికి అదనంగా ఉన్న ఆరో వేలును తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు. అందుకు కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు. అయితే, బాలిక ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన సమయంలో నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. ఆమె చేతికి ఆరో వేలు అలాగే ఉందని కుటుంబ సభ్యులు గమనించారు.
Read Also: Indonesia: ఇండోనేషియాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాన్ని ఆపడానికి క్లౌడ్ సీడింగ్..
ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నించగా, అక్కడ ఉన్న నర్సు బాలిక నాలుకకు కూడా సమస్య ఉందని చెప్పిందని, తప్పును కప్పిపుచ్చేందుకే ఇలా చెప్పిందని బాలిక బంధువులు ఆరోపించారు. వెంటనే డాక్టర్ జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పి, చేతికి శస్త్రచికిత్స చేసేందుకు బాలికను తీసుకెళ్లారు. నాలుకకు శస్త్రచికిత్స చేసినట్లు, తప్పు జరిగినట్లు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించింది. రిపోర్ట్ ప్రకారం బాలిక ‘‘టంగ్-టై’’ అనే వైద్య పరిస్థితిని కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరవ వేలు తొలగించే శస్త్రచికిత్సకు ముందు డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమె నాలుకకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ ప్రీత్ మాట్లాడుతూ.. ఈ కేసులో బాలికకు నాలుకకు సంబంధించిన సమస్య ఉందని డాక్టర్ గుర్తించి ఆపరేషన్ చేశారని, దీని వల్ల ఆమెకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అయితే, చిన్నారి కుటుంబ సభ్యులు మాత్రం ఆమె నాలుకకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఇది ఆస్పత్రి పొరపాటే అని నిర్లక్ష్యానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెంటనే వైద్య విద్య డైరెక్టర్‌తో విచారణకు ఆదేశించినట్లు సమాచారం.