NTV Telugu Site icon

Mayawati: సమాజ్‌వాదీ నేత కుమార్తెతో కొడుకు పెళ్లి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి..

Mayawati

Mayawati

Mayawati: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పార్టీ నేతని బహుజన్ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి సస్పెండ్ చేసింది. అయితే, అతను చేసిన తప్పు ఏంటంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత కుమార్తెతో తన కొడుకు వివాహం జరిపించడమే. ఎస్పీ ఎమ్మెల్యే తిభువన్ దత్ కుమార్తెతో కొడుకు పెళ్లి చేసినందుకు సురేంద్ర సాగర్‌ని బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇతడితో పాటు రాంపూర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ప్రమోద్ సాగర్‌ని తొలగించారు.

సురేంద్ర సాగర్, బీఎస్పీ కీలక నేత. బరేలీ డివిజన్‌లో చాలా పేరుంది. ఇతను రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. అయితే, ఎస్పీ నాయకుడితో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరణకు కారణమైంది. గతంలో బీఎస్పీ మాజీ ఎంపీగా ఉన్న త్రిభువన్ దత్, ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read Also: IND vs AUS: మ్యాచ్ మధ్యలో పవర్ కట్.. ట్రోల్స్‌తో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు

ఇటీవల ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీంతో యూపీలో ఈ పెళ్లి విషయం కాస్త వైరల్‌గా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షాణారాహిత్యం కారణంగా బహిష్కరిస్తున్నట్లు బీఎస్పీ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణల్ని సురేంద్ర సాగర్ ఖండించారు. నా కొడుకు అంకుర్‌కి ఎస్పీ ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో విహహం జరిపించడమే తన ఏకైక చర్య అని అన్నారు.

సురేంద్ర సాగర్ బీఎస్పీలో కీలకమైన వ్యక్తి. 2022లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇంతకుముందు కూడా బీఎస్పీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంది. నవంబర్‌లో ముంకద్ అలీ కుమారుడి వివాహానికి హాజరైన మాజీ డివిజనల్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ని బీఎస్పీ అధిష్టానం తొలగించింది.