NTV Telugu Site icon

Congress: హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక

Congress

Congress

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు ఇంకా అనుమానాలు తీరడం లేదు. హర్యానా పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అన్ని కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్‌దే అధికారం అంటూ ఊదరగొట్టాయి. కానీ ఫలితాలు వెలువడే సరికి అంతా రివర్స్ అయింది. ఊహించని విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో కాంగ్రెస్‌‌ భారీ షాక్‌కు గురైంది. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఈసీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను అప్పుడే తోసిపుచ్చింది. తాజాగా మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో ఈసీ స్పందించి ఖండించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ నమ్ముకుని మోసపోయిందంటూ ఎద్దేవా చేసింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ​కాంగ్రెస్‌ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి: Dola Sree Bala Veeranjaneya Swamy: ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటు..

తాజాగా ఎన్నికల సంఘం తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. ఈసీ తీరు.. కాంగ్రెస్‌ను అవమానించే విధంగా ఉందని పేర్కొంది. ఈసీ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని తెలిపింది. ఈసీ స్పందన, వాడిన భాష సరిగ్గా లేదని ధ్వజమెత్తింది. ఈసీ తీరు ఇలానే ఉంటే చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చింది.

ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌.. ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది.

‘‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది.’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ అంటూ లేఖలో తీవ్రంగా స్పందించింది. లేఖపై కేసీ వేణుగోపాల్‌, అశోక్‌ గహ్లోత్‌, అజయ్‌ మాకెన్‌ సహా తొమ్మిది మంది సీనియర్‌ నేతలు సంతకం చేశారు.

ఇది కూడా చదవండి: IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి