భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తోంది.. దేశవ్యాప్తంగా ఒకే రోజు నమోదైన కేసులు 3 లక్షలకు చేరువ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బంది కూడా ప్రాణాలువిడుస్తున్నారు.. ఇక, మహారాష్ట్ర, దాని రాజధాని ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా, ముంబైకి చెందిన ఓ మహిళా వైద్యురాలు.. ఫేస్‌బుక్‌లో ఇదే నా చివరి పోస్టు అని ఓ పోస్టు పెట్టి.. మరునాడే కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో మనీషా జాదవ్ అనే 51ఏళ్ల డాక్టర్.. సేవ్రి టీబీ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా విధిలు నిర్వహిస్తున్నారు.. క్షయవ్యాధి నిపుణురాలైన ఆమె.. కొద్ది రోజుల క్రితమే కోవిడ్ బారినపడ్డారు.. మొదట్లో ఆరోగ్యం బాగానే ఉన్నా క్రమంగా విషమిస్తూ వచ్చింది.. ఎంతలా అంటే అది ప్రాణాలమీదకు వచ్చింది.. తన చావును ఆమె ముందే ఊహించినట్టుంది.. తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు.. ‘ఇదే నా చివరి ఉదయం కావొచ్చు.. మళ్లీ మిమ్మల్ని కలవలేకపోవచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. నాకు శరీరం సహకరించడంలేదు.. ఆత్మ లేదు.. కానీ, అది అమరత్వం.. అంటూ తన వాల్‌పై రాసి పోస్టు చేశారు డాక్టర్ మనీషా.. ఇక, ఆ పోస్టు పెట్టిన మరునాడే ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, కోవిడ్ ఫస్ట్ వేవ్‌తో పాటు.. సెకండ్ వేవ్‌లోనూ ఇప్పటికే చాలా మంది వైద్యులు, వైద్య సిబ్బంది.. పోలీసులు, జర్నలిస్టులు ఇలా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.