NTV Telugu Site icon

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి..

Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, నారాయణ‌పూర్ జిల్లా సరిహద్ద ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి ఏరియా కమిటీ, నారాయణపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్‌తో పాటు ఎస్టీఎఫ్ బృందాలపై కాల్పులు జరగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఇప్పటికే ఏడుగురు నక్సల్స్ మరణించగా, 12 మంది నక్సలైట్లు గాయపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Read Also: Swati maliwal: పాలిగ్రాఫ్ టెస్ట్‌ కోసం పోలీసులకు రిక్వెస్ట్.. కారణమిదే!

నారాయణపూర్ బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో ప్లాటూన్ నంబర్ 16, ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్లు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 100కు పైగా నక్సలైట్లు ఎన్‌కౌంటర్లలో మరణించారు. రెండు వారాల క్రితం బీజాపూర్ పిడియా గ్రామ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది నక్సలైట్లు మరణించారు.