NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్‌లో అరాచకాలెన్నో.. ఒక్కొక్కటిగా బయటికి

Manipur Violence

Manipur Violence

Manipur Violence: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ గత రెండున్నర నెలలుగా హింసతో అట్టడుకుతోంది. మే 3న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా రాజుతూనే ఉంది. రెండున్నర నెలల్లో ఎనో్న హింసాత్మక సంఘటనలు.. అమానవీయ ఘటనలో చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గానీ, ఘటనలు గానీ హింస గానీ బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్‌ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Read also: Seema Haider: ఐఎస్‌ఐకి సీమా హైదర్ భయపడిందా.. భారత్‌లో ఆశ్రయానికి సచిన్‌ను పావుగా వాడుతోందా?

ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాడి అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు మనవడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది. మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధాని ఇంఫాల్‌కి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతీ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఆ గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.