Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

Manipur

Manipur

మణిపూర్‌లో బుధవారం కీలక పరిణామం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. గత ఫిబ్రవరి 13న ఎన్.బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపింది. తాజాగా బుధవారం 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి తోక్చోమ్‌ రాధేశ్యామ్‌ బుధవారం ప్రకటించారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసేందుకు 10 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వచ్చినట్లు పేర్కొ్న్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరిందా? అనే ప్రశ్నకు రాధేశ్యామ్‌ సమాధానం దాటవేశారు.

ఇది కూడా చదవండి: Madhabi Puri Buch: సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. మార్కెట్ మోసం కేసులో క్లీన్‌చిట్

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్‌ నిషికాంత సింగ్ మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని, ఆ కారణంగానే తాము గవర్నర్‌ను కలిసామని చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపరును గవర్నర్‌కు అందజేశామని, మణిపూర్‌లోని ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. ప్రజా మద్దతును కూడా తాము కోరుతున్నామన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, 10 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..

మణిపూర్‌ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. 2022 మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు నెగ్గింది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే హింస కారణంగా సీఎం రాజీనామాతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.

 

Exit mobile version