మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. విలయం సృష్టిస్తోంది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. మహాబలిపురంకు వాయవ్యంగా 70కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడుపై కొనసాగుతూ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి 55కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. నేడు తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో చలిగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, ఈ తుఫాన్ ఏపీపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది..
ఈరోజు తెల్లవారుజామున చెన్నైలోని కాసిమేడు ప్రాంతంలో మాండూస్ తుఫాన్ బాధిత ప్రజలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వరద సహాయక సామగ్రి, ఆహారాన్ని పంపిణీ చేశారు. అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
Tamil Nadu CM MK Stalin distributed flood relief-material and food among #CycloneMandous affected people in the Kasimedu area of Chennai earlier today. pic.twitter.com/oLBE9kP81r
— ANI (@ANI) December 10, 2022
మాండూస్ తుఫాన్ కారణంగా.. కడప ఉక్కు కోసం చేస్తోన్న పాదయాత్రను సీపీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. వాయిదా వేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో కడపలోని జమ్మలమడుగులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నుంచి పెన్నానదికి 2 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో.. సాయంత్రంలోగా 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు.. గండికోట నుంచి మైలవరానికి 4 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేయడం జరిగింది. గండికోటలో ప్రస్తుతం 26.4 టీఎంసీల వాటర్ నిల్వ ఉండగా.. మైలవరంలో 6 టీఎంసీల నీరు ఉంది.
మాండూస్ తుఫాను కారణంగా కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో.. అనంతపురం జిల్లా యల్లనూరు పరిధిలోని చిత్రావతి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి రిజర్వాయర్‌కు 1000 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో.. నది నుంచి 1200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. తద్వారా సింగవరం గ్రామ సమీపంలో రోడ్డుపై నీరు పొంగిపొర్లుతోంది. నీటి ప్రవాహానికి రోడ్డు తెగిపోవడంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
చెన్నైలోని టి.నగర్ ప్రాంతంలో గోడ కూలి దాని సమీపంలో పార్క్ చేసిన మూడు కార్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఘటన జరిగిన సమయంలో కార్లలో ఎవరూ లేరు.
#CycloneMandous aftermath | A wall collapsed in T Nagar area of Chennai and caused serious damage to three cars that were parked near it. Nobody was present in the cars at the time of the incident.#TamilNadu pic.twitter.com/oxoeAhcHlJ
— ANI (@ANI) December 10, 2022
చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. తమిళనాడు సరిహద్దులో ఉన్న నగరి నియోజకవర్గంలో కుండపోత కురుస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో.. జిల్లాలోనే అత్యధికంగా నగరిలో 181 మి.మీ, విజయపురంలో 159 మి.మీ, నిండ్రలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది.
మాండూస్ తుఫాను కారణంగా భారీ వర్షాలు పడుతుండడటంతో.. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రవాహం ఇలానే కొనసాగితే.. మధ్యాహ్నానికి డ్యాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది.
తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులకు చెట్లు పడిన చోట ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే తొలగించాలని, రాకపోకలకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ అధికారుల్ని ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తంగా ఉండి, లైన్లు కట్ అయిన చోట వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ సహాయకచర్యలను ప్రారంభించాలని సూచించారు.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోనే అత్యధికంగా కెవిబి పురం మండలంలో 253 మి.మీ, తొట్టంబేడులో 200 మి.మీ, శ్రీకాళహస్తిలో 198 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు తేలింది. సూళ్లూరుపేట, గూడూరు డివిజన్ల పరిధిలోనూ అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిసింది.
అనకాపల్లి జిల్లాలో వరి రైతులపై మాండూస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తుండడంతో.. వరి పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈదురు గాలుల కారణంగా చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఓ పెద్ద చెట్టు నేలకూలింది.
#CycloneMandous | A large tree got uprooted in Egmore area of Chennai due to strong winds. pic.twitter.com/D7xZLQUMDB
— ANI (@ANI) December 10, 2022
రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో మాండూస్ తుఫాప్ తీరం దాటినట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. తుఫాను తీరం దాటినప్పటికీ.. రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మాండూస్ తుఫాన్ కారణంగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఆకాశం మేఘావృతంగా మారింది. పలు కోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో.. ధాన్యం అమ్మకాలు ఇంకా పూర్తి కాని వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఓడలరేవు, అంతర్వేది సముద్ర తీరంలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి.
మాండూస్ తుఫాన్ కారణంగా.. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో 10 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. సోమశిల జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. 25 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఒకవేళ ఎగువ ప్రాంతం నుంచి నీరు వస్తే, మరింత విడుదల చేస్తామని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అటు.. కండలేరు జలాశయంను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పంటలకు నష్టం లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యానవనంలో ఉన్న పంటలకు ఈ వర్షం ప్రయోజనం కలిగించింది. మైపాడు, కోడూరు, తుమ్మలపెంట బీచ్‌ల వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. తీరం వద్ద పర్యాటకులు తరలి వస్తుండడంతో.. అటువైపు ప్రజలు రాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నై, విజయవాడ మార్గంలో రైల్వే ట్రాక్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
తిరుపతిలోని నాయుడు పేట, సూళ్లూరు పేట, తడ, దొరవారి సత్రం, పెళ్లకూరు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నారు. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కెనాడీ నగర్‌లో ఇళ్లన్నీ వరద నీరుతో నిండిపోవడంతో.. కాలనీ వాసులు రోడ్డు మీదకి వచ్చారు. ఆర్టీసి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. శ్రీవారి భక్తులకూ ఇబ్బందులు తప్పట్లేదు. పులికాట్ సరస్సుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు తమ పడవల్ని తీరం నుంచి తెచ్చుకుంటున్న క్రమంలో మూడు పడవలు నీట మునిగాయి. నాయుడుపేట ప్రాంతంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్వర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తూపిలి పాలెం బీచ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయి. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. గూడూరులోని పంబలేరులో కూడా ప్రవాహం పెరిగింది. పాముల కాలువ ఉధృతంగా పారుతుండడంతో.. ఆరు గ్రామపంచాయతీలకు రాకపోకలు అంతరాయం కలిగింది. వరదయ్యపాలెంలోని శ్రీకాళహస్తి చెన్నై ప్రధాన రహదారిపై సున్నపు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు ట్రాఫిక్‌ని నిలిపివేశారు. అనిల్ సెంటర్లో 6 ఇళ్లు నీట మునిగిపోయాయి.
మాండూస్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కారణంగా తమిళనాడులోని ఆరుంబాక్కం ఎంఎండీఏ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
#WATCH | Roads waterlogged in MMDA Colony of Arumbakkam in Tamil Nadu due to heavy rain
#CycloneMandous pic.twitter.com/nW5OuJiFBU— ANI (@ANI) December 10, 2022
మాండూస్ తుఫాన్ కారణంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 80 కిలోమీటర్ల గాలులతో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తుండటంతో ఆ రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఎక్కడికక్కడ చెట్లు, హోర్డింగ్‌లు నేలరాలాయి. చెరువలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
మాండూస్ తుఫాన్ ప్రభావం తిరుపతిలో జిల్లాలో భారీ ప్రభావాన్ని చూపుతోంది.. వరదయ్యపాలెం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తోంది పాముల కాలువ.. దీంతో, ఆరు గ్రామపంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.. వరదయ్యపాలెంలోని శ్రీకాళహస్తి చెన్నై పోవు ప్రధాన రహదారిపై నున్న సున్నపు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ ని నిలిపివేశారు పోలీసులు. వరదయ్యపాలెం మండలంలోని అనిల్ సెంటర్‌లో కొన్ని ఇళ్లు నీటమునిగాయి
మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండూస్ తుఫాన్.. తమిళనాడులో కుండపోత వర్షాలు, చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై , కాంచీపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం జిల్లాలో భారీ వర్షాలు