Chennai man Worked in Three Companies: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు కంపెనీలలో పని చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో ఓ వ్యక్తి ఒకే సమయంలో మూడు కంపెనీలలో ఉద్యోగాలను చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. శ్వేతా శంకర్ అనే మహిళ ర్యాపిడో బుక్ చేసుకోగా.. శంకర్ అనే వ్యక్తి వచ్చి పిక్ చేసుకున్నాడు. సదరు వ్యక్తి స్విగ్గీ యూనిఫాంలో, డన్జో బ్యాగ్‌తో, ర్యాపిడోలో ఆమెను పిక్ చేసుకున్నాడు. అతడిని చూసి అనుమానం వచ్చిన మహిళ ఈ విషయం గురించి అడగ్గా మూడు కంపెనీల్లో పనిచేస్తున్నట్లు వివరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు 10వేల లైకులు, టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చాయి. కాగా స్మార్ట్ వ్యక్తులు ఇలాగే పనిచేస్తారని.. దీనికి శంకర్ ప్రత్యక్ష ఉదాహరణ అంటూ కొనియాడింది.
కాగా స్విగ్గీ, ర్యాపిడో వంటి సంస్థల ద్వారా చాలా తక్కువ జీతాలు వస్తాయని.. అందుకే ఇలా పనిచేస్తుంటారని కొందరు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు సదరు వ్యక్తి చాలా తెలివిగా పనిచేస్తున్నాడని ప్రశంసించారు. జొమాటో ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లే సమయంలో ర్యాపిడో ద్వారా కస్టమర్లను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ మధ్యలో డన్జో ఆర్డర్లను స్వీకరించడం పెద్ద కష్టమేమీ కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
