NTV Telugu Site icon

Bengaluru: డోర్‌ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్‌పై కత్తితో దాడి.. వీడియో వైరల్

Bengaluru

Bengaluru

ఆర్టీసీ బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ఫుట్‌బోర్డు దగ్గర ఎవరూ నిలబడొద్దని కండక్టర్ హెచ్చరిస్తుంటాడు. బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని.. అలాగే ఫుట్‌బోర్డు ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఈ మాటే ఒక వ్యక్తికి రుచించలేదు. కండక్టర్ ఆ మాట అన్నందుకు ఏకంగా హత్య చేసేందుకు రెడీ అయ్యాడు. అక్కడితో ఆగకుండా సహచర ప్రయాణికులపై బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

జార్ఖండ్‌కు చెందిన హర్ష్ సిన్హా యోగేష్ అనే వ్యక్తి బెంగళూరు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఆటోమేటిక్‌‌గా డోర్ క్లోజ్ అవుతుంంది. అయితే కండక్టర్ యోగేష్ ఫుట్‌బోర్డు మీద నిలబడొద్దని సూచించాడు. అంతే బ్యాగ్‌లోంచి కత్తి తీసి కండక్టర్‌ను పొడిచాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికులను కూడా బెదిరించాడు. ఈ దృశ్యాలు బస్సులో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది. యోగేష్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) తెలిపింది.

నిందితుడు హర్ష్ సిన్హాను బీపీవో సంస్థ తొలగించింది. మూడు వారాల నుంచి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడును అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. బస్సు ఎక్కే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కండక్టర్ ఫుట్ బోర్డు మీద నిలబడ వద్దన్నాడని చెప్పారు. ఇంతలో బ్యాగ్‌లోంచి కత్తి తీసి పొడిచాడని పోలీసులు వివరించారు.

ప్రయాణికులు అంతా కిందకు దిగేశారు. అనంతరం బస్సు డ్రైవర్ సిద్దలింగస్వామి డోర్ లాక్ చేసి బయటకు దూకగా హర్ష లోపల ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత బస్సులోంచి తప్పించుకునేందుకు అద్దాల తలుపులను తన్నడం, పగలగొట్టడం చేశాడు. నిందితుడు బస్సులో చిక్కుకోవడంతో డ్రైవర్‌, ప్రయాణికులు పోలీసులకు ఫోన్‌ చేసి నిందితుడిని పట్టించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.