Missing Pet Parrot Found in Karnataka: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో సదరు యజమాని దాన్ని పట్టించినందుకు రూ.50,000 రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ముందుగా అనుకున్న రూ. 50,000 కన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 రివార్డు ఇచ్చాడు. ఆఫ్రికా గ్రే చిలుక ‘రుస్తుమా’ ఇటీవల తన యజమాని దగ్గర నుంచి వెళ్లిపోయింది. అరుదైన రకం చిలుక కావడంతో దీన్ని పట్టించిన వారికి అరలక్ష బహుమతిగా ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీని ఆచూకీని కనుకునేందుకు యజమానులు స్థానికంగా అన్ని ప్రాంతాల్లో వెతికారు.
Read Also: MLA Rajasingh: నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారింది
పక్షి యజమాని రవి, తన కుటుంబంతో తుముకూరు జిల్లాలోని జయనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు రెండు ఆఫ్రికన్ గ్రే రకానికి చెందిన చిలుకలను పెంచుకుంటున్నాడు. వీటిలో రుస్తుమా అనే చిలుక ఈనెల 16న కనిపించకుండా పోయింది. చిలుక యజమాని పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది.‘రుస్తుమా’ తన సహచరిగా ఉన్న చిలుక పలుకలకు ప్రతిస్పందిస్తుందని తెలిసి ఆ పక్షితో కూడా వెతికారు. అయినా కూడా చిలుక ఆచూకీ లభించలేదు. అయితే వారం రోజుల తరువాత తుముకూరులోని బందెపాళ్యకు చెందిన శ్రీనివాస్ తన నివాసంలో అరుదైన చిలుకను గమనించి దాన్ని తన వద్ద భద్రంగా దాచాడు. అయితే చిలుక ప్రకటన ఆ నోట..ఈ నోట పడి శ్రీనివాస్ కు తెలిసింది. దీంతో శ్రీనివాస్, చిలుక యజమానిని పిలిచి వారికి దాన్ని అప్పగించారు. యజమాని రవి ప్రకటించిన రివార్డు కన్నా ఎక్కువ రివార్డును గెలుచుకున్నాడు.