Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం యువత పెద్ద ఎత్తున వీడియోలు చేస్తున్నారు. కొందరు వినోదం కోసం చేస్తే, మరికొందరు ఫాలోవర్లు పెంచుకోవడం, పాపులారిటీ దక్కించుకోవడం కోసం కూడా రీల్స్ చేస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ రీల్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక వ్యక్తి తన భార్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీలమైన రీల్స్ చేయవద్దని అడ్డుకున్నందుకు కత్తితో దాడి చేసిందని అనీస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Delhi Horror: ప్రసాదంపై వివాదం.. ఆలయ సేవకుడు హత్య
అయితే, బాధితుడు అనీస్ చేసిన ఫిర్యాదులో.. తన భార్య ఇష్రత్ క్రమం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల రీల్స్ చేస్తోంది.. వాటిని ఆపమని అడిగిన ప్రతిసారీ ఆమె నన్ను తప్పుడు కేసులలో ఇరికిస్తానని బెదిరించడమే కాకుండా, ఒకసారి నాపై కత్తితో దాడి కూడా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులకు సమర్పించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే, చాలా కాలంగా తన ప్రవర్తనలో మార్పులు వచ్చాయి.. నా భార్యకు ఇతర పురుషులతో సంబంధాలు ఉన్నాయని, ఇంటి బాధ్యతలను పట్టించుకోకుండా ఫోన్ లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోందని ఆరోపించాడు. ఈ విషయాలపై అడిగితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పాటు నా కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరించడం లాంటివి చేస్తోందన్నాడు. గతంలో కూడా ఆమె తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నాడు. ఇక, ఇప్పుడు నన్ను నా ఇంట్లోంచి బయటకు గెంటేశారని అనీస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also: Tollywood Box Office : 2004 సంక్రాంతి క్లాష్ 2026లో రిపీట్ అవుతుందా?
ఇక, అనీస్ ఫిర్యాదు ఆధారంగా లోనీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది అని ఘజియాబాద్ ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ ధృవీకరించారు. సదరు వీడియోలో అనీస్ భార్య ఇష్రత్ కత్తితో దాడి చేయడం, బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ కేసులోని అన్ని అంశాలను పూర్తిగా పరిశీలిస్తున్నాం.. త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఏసీపీ తెలియజేశారు.
