Heart Attack: ఇటీవల కాలంలో చిన్న పిల్లాడి నుంచి యువకుల వరకు పలువురు అకస్మాత్తు గుండెపోటుల వల్ల మరణిస్తున్నారు. 30 ఏళ్లకు దిగువన ఉండే యువకులు కూడా ఇలా ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించాడు. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో 22 ఏళ్ల ఇందల్ సింగ్ జాదవ్ బంజారా గుండెపోటుకు గురై మరణించాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Read Also: Boeing 737 MAX: బోయింగ్ 737 మాక్స్ విమాన రడ్డర్‌లో సమస్యలు.. అప్రమత్తమైన విమానయాన సంస్థలు..
క్రికెట్ ఆడుతున్న సమయంలో బంజారా బౌలింగ్ చేస్తున్న క్రమంలో అసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు బద్వా సివిల్ ఆస్పత్రి డాక్టర్ వికాస్ తల్వేర్ తెలిపారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంజారాను ఆస్పత్రికి తరలించిన వ్యక్తులు మ్యాచ్ సందర్భంగా అతనికి ఛాతీలో నొప్పి వచ్చినట్లు తెలిపారని డాక్టర్ తల్వేర్ చెప్పారు. తొలుత బ్యాటింగ్ చేసి 70 రన్స్ చేసిన బర్ఖడ్ తండా గ్రామ జట్టుకు బంజారా ఆడుతున్నట్లు గ్రామస్తుడు శాలిగ్రామ్ గుర్జర్ తెలిపారు. బంజారా బౌలింగ్ చేస్తు్న్న క్రమంలో ఛాతి నొప్పి రావడంతో, చెట్టుకింద కూర్చున్నాడని అతను చెప్పాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జంజారా తనని ఆస్పత్రికి తీసుకెళ్లమని తోటి ఆటగాళ్లను కోరాడు, బద్వా సివిల్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలోనే మరణించాడని గుర్జర్ తెలిపారు.
