NTV Telugu Site icon

పెగాసస్‌ రగడ.. దీదీ కీలక నిర్ణయం

Mamata Banerjee

Mamata Banerjee

పెగాసస్‌ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్‌ సమావేశాలను సైతం పెగాసస్‌ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియ‌ర్ న్యాయ‌మూర్తి మ‌ద‌న్ భీంరావ్ లోకూర్‌, కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ‌మూర్తి జ్యోతిర్మయ్ భ‌ట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్‌, నిఘాల‌పై ద‌ర్యాప్తున‌కు ద్విస‌భ్య క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్‌, నిఘా, మొబైల్ ఫోన్ల రికార్డింగ్ వంటి ఆరోప‌ణ‌ల‌పై ఈ కమిటీ విచార‌ణ జ‌రుపుతుందని.. పెగాస‌స్ ర‌గ‌డ‌పై విచార‌ణ‌కు ఆదేశించిన మొట్టమొదటి రాష్ట్రం త‌మ‌దే అంటున్నారు మ‌మ‌తా బెన‌ర్జీ. దుమారం రేపుతోనన ఈ వ్యవహారంపై చర్చిస్తారని.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప‌ర్యవేక్షణ‌లో విచార‌ణ చేప‌డుతుంద‌ని ఆశించామన్న దీదీ.. కానీ, ఆ దిశ‌గా కేంద్రం చొర‌వ తీసుకోవడంలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసకున్నట్టు వ్యాఖ్యానించారు. మరోవైపు.. పెగాసస్‌ స్కామ్‌ వెలుగుచూసిన తర్వాత… తన ఫోన్లు ట్యాప్‌ చేస్తారని.. ఫోన్‌కు ప్లాస్టర్‌ వేశానంటూ దీదీ చేసిన కామెంట్లు చర్చగా మారిన సంగతి తెలిసిందే.