పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అది పెద్ద శక్తిగా నిలిచింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు మమతా బెనర్జీ సహకరించాలి. కానీ అందుకు భిన్నంగా ఆమె సంచలన ప్రకటన చేశారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోలేదని.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. లోక్‌భవన్‌కు కూడా వెళ్లను.’’ అని ప్రకటించారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం మమత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మేధావులు, న్యాయ నిపుణుల నుంచి రకరకాలైన విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ కాలం మే 6తో ముగుస్తోంది. అనంతరం ఆమె పదవిలో కొనసాగడానికి వీలుండదు. రాజీనామా చేయకపోయినా ఆమె ప్రభావం ఉండదు. రాష్ట్ర గవర్నర్‌కు అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఆటోమేటిక్‌గా ముగిసినట్లే అవుతుంది.’’ అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. అయితే ప్రతిఘటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసినందున గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తారని.. దీంతో ఆటోమేటిక్‌గా మమత ప్రభుత్వ పదవీకాలం కూడా ముగుస్తుందని పేర్కొన్నారు.
మమత ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కూడా కలవను. తన ఓటమికి ఎన్నికల సంఘమే కారణం. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు తనపై దాడి కూడా జరిగింది.’’ అని మమత ఆరోపించారు.
