Site icon NTV Telugu

Amit Shah: ముస్లిం ఓటు బ్యాంకు కోసమే మమతాబెనర్జీ ఆరాటం.. ‘‘సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’పై వ్యతిరేకత..

Amit Shah

Amit Shah

Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి మమతా ‘‘ఆపరేషన్ సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల, ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లు రాష్ట్ర స్పాన్సర్ చేసిందని అన్నారు. ‘‘ ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా దీదీ ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించారు. అలా చేయడం ద్వారా, ఆమె ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులను అవమానిస్తున్నారు. 2026 (అసెంబ్లీ ఎన్నికలు)లో, ఆపరేషన్ సిందూర్‌ను విమర్శించినందుకు రాష్ట్ర మహిళలు మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పుతారు’’ అని అమిత్ షా చెప్పారు.

Read Also: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..

ఏప్రిల్ లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో టీఎంసీ నాయకులు పాల్గొన్నారని, అల్లర్ల సమయంలో బీఎస్ఎఫ్‌ని మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరినప్పటికీ, హింసను కొనసాగించేందుకే టీఎంసీ ప్రభుత్వం దానికి అనుమతించలేదు అని అమిత్ షా ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు టీఎంసీ సహాయపడుతుందని చెప్పారు.

‘‘మమతా బెనర్జీ బంగ్లాదేశీయుల కోసం బెంగాల్ సరిహద్దులను తెరిచారు. ఆమె చొరబాట్లను ఎప్పటికీ ఆపలేరు, బిజెపి మాత్రమే దీన్ని చేయగలదు’’ అని అన్నారు. బీఎస్ఎఫ్ చొరబాట్లను ఆపలేకపోతుందని ఇటీవల టీఎంసీ విమర్శించిన నేపథ్యంలో, మమతా బెనర్జీ సర్కార్ బీఎస్ఎఫ్‌కి అవసరమైన భూమి ఇవ్వడం లేదని అమిత్ షా అన్నారు. తమకు భూమి ఇస్తే చొరబాట్లను ఆపేస్తామని, కానీ మమతా బెనర్జీ దీనికి ఒప్పుకోదని, అధికారంలో ఉండేందుకు చొరబాట్లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.

Exit mobile version