పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంత టార్గెట్ చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా సహా బీజేపీ కేంద్ర పెద్దలు ప్రత్యేకంగా దృష్టిసారించినా.. మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు మమతా బెనర్జీ.. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు… మమత బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖండ మెజార్టీ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. టీఎంసీని బెంగాల్‌కే పరిమితం చేయకుండా.. అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించారు. త్రిపుర ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు దీదీ.
మరోవైపు, వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించారు మమత బెనర్జీ. ఇందులో భాగంగా కీలక నేతలతో పాటు జనంలో పేరున్న సెలబ్రెటీలను.. టీఎంసీలోకి ఆహ్వానిస్తున్నారు. కమలం పార్టీ నేతలు.. తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ అంటే టెంపుల్, మసీదు, చర్చ్‌ల కోసం నిలబడే పార్టీ అని తమకు అన్ని మతాలూ ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారుడు లియాండర్ పేస్.. తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. పేస్‌ను పార్టీలోకి ఆహ్వానించిన దీదీ.. తనకు సోదరుడి వంటి వాడని అన్నారు. పేస్ టీఎంసీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. అటు నటి, సామాజిక కార్యకర్త నఫిసా అలీ.. టీఎంసీ కండువా కప్పుకున్నారు. మొత్తంగా ఆయా రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. సాధారణ ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల నుంచి లోక్‌సభకు కూడా ఆ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని.. ఆమె కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
