NTV Telugu Site icon

West Bengal SSC Scam: మంత్రి పార్థా ఛటర్జీపై వేటు.. పదవులన్నింటి నుంచి తొలగింపు

Partha Chatterjee

Partha Chatterjee

West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్ టీచర్‌ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ స్కాంలో ఆయన అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆయన మంత్రిగా ఉన్న వాణిజ్య, పరిశ్రామిక శాఖతో పాటు ఐటీ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే చూసుకుంటారు. మరోవైపు ఈ కుంభకోణంలో అరెస్టయిన పార్థ ఛటర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ పదవులన్నింటి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తొలగించారు. విచారణ జరిగే వరకు ఛటర్జీని సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ మీడియాకు తెలిపారు. పార్థా ఛటర్జీని టీఎంసీ జనరల్ సెక్రటరీ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, మరో మూడు పదవులను కూడా తొలగించారని.. విచారణ జరిగే వరకు ఆయనను సస్పెండ్ చేశారనిబెనర్జీ తెలిపారు. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించే నిర్ణయాన్ని కూడా బెనర్జీ ప్రస్తావించారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని.. ఎవరూ తప్పు చేసిన టీఎంసీ సహించదని బెనర్జీ అన్నారు,

పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. పార్థ ఛటర్జీని అరెస్టు చేసినప్పటి నుండి ఈడీ ఆయన అనేక ఆస్తులను వెలికితీసింది. వీటిలో పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ సిటీలోని మూడు ఫ్లాట్లు ఉన్నాయి.ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు చేపట్టిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. పార్థా అత్యంత సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే పార్థా, అర్పితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అర్పితా ముఖర్జీకి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం అధికారుల బృందం అర్పితా ముఖర్జీ న్యూ టౌన్ నివాసానికి చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ టౌన్‌లోని చినార్ పార్క్‌లోని ఆమె నివాసానికి సెంట్రల్ ఫోర్స్ సిబ్బందితో కలిసి అధికారులు చేరుకున్నారు. బాలిగంజ్‌లోని వ్యాపారవేత్త మనోజ్ జైన్ నివాసంలో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. జైన్ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీకి సహాయకుడు.

Adhir Ranjan Chowdhury: క్షమాపణ చెబుతా.. ఈ వివాదంలోకి సోనియాను ఎందుకు లాగుతున్నారు..

ఈ వివాదం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ ప్రతిపక్ష భాజపా, సీపీఎంలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే పార్థా ఛటర్జీ వ్యవహారంపై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తప్పు చేస్తే తాను ఎవరినీ వదిలపెట్టబోనని చెప్పిన విషయం తెలిసిందే. మంత్రి అయినా సరే చర్యలు తీసుకుంటామని దీదీ అన్నారు.తాజాగా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బుధవారం అర్పిత ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 28.90 కోట్ల నగదు, 5 కేజీలకు పైగా బంగారం, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆమె నివాసం నుంచి రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Show comments