Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు

  • టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది
  • గెలవడానికి బీజేపీ ఈసీని వాడుకుంది
  • ఎన్నికల సంఘమే అతి పెద్ద విలన్
  • మమత సంచలన ఆరోపణలు
Mamatabanerjee

Mamatabanerjee

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం మమత మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. గెలవడానికి బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంది. ఎన్నికల సంఘమే అతి పెద్ద విలన్.’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా.. టీఎంసీ 80 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలపై మమత మీడియా వేదికగా మాట్లాడుతూ ఈసీపై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు.

‘‘మా పోరాటం బీజేపీతో కాదు. ఎన్నికల సంఘంతో. నా జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదు. 2004 తర్వాత ఇంతటి అఘాయిత్యాలను చూడలేదు. ఎన్నికల సంఘమే ప్రధాన విలన్. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారు. బీజేపీ 100 సీట్లను దొంగిలించింది. మమ్మల్ని ఓడించడానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారు. మమ్మల్ని ఓడించడానికి బీజేపీ సాధ్యమైన ప్రతీ ఎత్తుగడను ఉపయోగించింది. బీజేపీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడి చేశారు.’’ అని ఆరోపించారు.

కూటమి అండ..
‘‘ఇండియా కూటమి నాకు అండగా ఉంది. సోనియా గాంధీ, రాహుల్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్ అందరూ నాకు ఫోన్ చేశారు. కూటమి నాకు అండగా ఉంది. అఖిలేష్ యాదవ్ రేపు బెంగాల్ వస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు నేను స్వేచ్ఛా పక్షిలా ఉన్నాను. నాకు చేయాల్సిన పని ఉంది. కానీ మేము పోరాటం ఆపం. బీజేపీ అప్పుడే ప్రజలను హింసించడం మొదలుపెట్టింది. వారు షెడ్యూల్డ్ కుల, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలపై కూడా దాడి చేశారు. వారిపై అత్యాచారం చేస్తామని బీజేపీ బెదిరించింది. బీజేపీ తన గూండాలతో దాడులు మొదలుపెట్టింది. పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నారు. మాకు మార్పు కావాలి. ప్రతీకారం కాదు అనే నినాదాన్ని మేము లేవనెత్తాము. ఇది సైనికుల దళమా లేక గూండాల దళమా?.’’ అని మమత ప్రశ్నించారు.

మీడియాపై ధ్వజం
మొదటి విడత ఓట్ల లెక్కింపు తర్వాత… బీజేపీ ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటూ మీడియా వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టిందని.. అంతే వెంటేనే బీజేపీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపించారు. ‘‘నా వీపుపైనా, కడుపుపైనా తన్నారు.’’ అని మమత పేర్కొన్నారు.