NTV Telugu Site icon

Mamata Banerjee: కోల్‌కతా ఆస్పత్రి విధ్వంసం వెనక ఉన్నది వారే.. మమతా బెనర్జీ ఆరోపణలు..

Mamata Abnerjee

Mamata Abnerjee

Mamata Banerjee: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఆ రాష్ట్ర ప్రజలు, వైదుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. పీజీ ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉండగా ఆమెపై అత్యాచారం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రి సెమినార్ హాలులో ఆమె మృతదేహం నగ్నంగా, ఒంటిపై గాయాలతో కనిపించింది. అయితే, ఈ ఘటన ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనకు కారణమైంది. ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కోల్‌కతా పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మెడికల్ కాలేజీ, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, ఆర్జీ కాలేజ్‌, ఆస్పత్రిపై జరిగిన దాడిలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల పాత్ర ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఆరోపించారు. గవర్నర్‌ని కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వారు “బయటి వ్యక్తులు” వారు “వామపక్షాలు , బిజెపి జెండాలను మోసుకెళ్లారు” అని పేర్కొన్నారు. ‘‘బామ్ అండ్ రామ్’’కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు. ఇందులో విద్యార్థుల పాత్ర లేనది, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని రేపు ర్యాలీ చేస్తామని ఆమె అన్నారు.

Read Also: Live Location: మహిళ హత్య కేసులో పోలీసులకు సాయపడిన ‘‘లైవ్ లొకేషన్’’.. ఏం జరిగిందంటే..

తాను వామపక్షాలు, బీజేపీ జెండాలను చూశానని, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసంతో రోగులు బయటకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. చాలా మంది రోగులు చికిత్స పొందకుండా వారి గ్రామాలకు వెళ్తున్నారని, కొంతమంది మరణించారనే వార్తలు నాకు వినిపిస్తున్నాయని, కొంతమంది వైద్యులు సేవల్ని అందిస్తున్నారని ఆమె తెలిపారు. బెంగాల్ ప్రతిష్టను నాశనం చేయాలని వామపక్షాలు, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయని, సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో అది నిజం కాదని, యూట్యూబ్‌లో వీక్షకులను పెంచుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిపై నిఘా పెట్టాలని పోలీసులకు చెప్పానని సీఎం చెప్పారు.

బుధవారం రాత్రి బాధితురాలకి న్యాయం చేయాలంటూ ‘‘రీక్లైమ్ ది నైట్’’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగా వేలాది మంది మహిళలు పశ్చిమ బెంగాల్‌లో రోడ్లపైకి వచ్చారు. నిరసనలు చాలా వరకు శాంతియుతంగా ఉండగా, ఒక గుంపు బలవంతంగా ఆస్పత్రిలోకి ప్రవేశించి, దాడి చేసింది. ఐసీయూని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ ప్రయోగించారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి విధ్వంసంపై మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. దాడి జరుగుతుంటే పోలీసులు ఎక్కడ ఉన్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తుని అడ్డుకునేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఆస్పత్రి విధ్వంసానికి పాల్పడినట్లు బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.