NTV Telugu Site icon

Maldives Row: ‘‘దయచేసి విమాన బుకింగ్స్ ఓపెన్ చేయండి’’.. ‘ఈజ్‌మైట్రిప్’కి మాల్దీవ్స్ సంఘం వేడుకోలు..

Maldives Row

Maldives Row

Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగింది. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. ఇటీవల ప్రధాని లక్షద్వీప్ వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద పోస్టులను పెట్టారు. దీంతో చాలా మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ యాత్రల్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్‌తో పాటు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రముఖ బుకింగ్, టూరిజం ప్లాట్‌ఫామ్ ‘ఈజ్‌మైట్రిప్’ మాల్దీవులకు సంబంధించి ఫ్లైట్ రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయంపై మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్(MATATO) మంగళవారం ఈజ్‌మైట్రిప్‌కి మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని కోరింది. ఇది సాధారణ మాల్దీవ్స్ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే వ్యాఖ్యలు కానది అన్నారు. కోవిడ్ తర్వాత తమ దేశానికి వచ్చిన టూరిస్టుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారని, వారు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడ్డారని ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని ఉద్దేశిస్తూ చెప్పింది.

Read Also: High Court: అత్యాచార బాధితురాలు 8 నెలల ప్రెగ్నెన్సీ తొలగించుకునేందు కోర్టు అనుమతి..

‘‘మాల్దీవ్స్, భారత్ మధ్య సంబంధాన్ని నిర్వహించే శాశ్వత స్నేహం మరియు భాగస్వామ్యానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా దేశాలను రాజకీయాలకు అతీతంగా కలిపే బంధాలను మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము మా భారతీయులను ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులుగా పరిగణిస్తాము.’’ అని MATATO చెప్పింది. పర్యాటక రంగమే మాల్దీవులకు జీవనాధారం, మా జీడీపీలో మూడింట రెండొంతులకు పైగా సహకారం అందిస్తోంది. ఈ రంగంలో పనిచేసే సుమారు 44,000 మంది మాల్దీవులకు జీవనోపాధిని అందిస్తోందని, పర్యాటకంపై ప్రభావం చూపించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై పరిణామాలను కలిగించే శక్తి ఉందని తన ప్రకటనలో తెలిపింది.

మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారత్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. గత రెండేళ్లలో 4.5 లక్షల మంది ఈ దేశానికి వెళ్లారు. కరోనా సమయంలో కూడా 63,000 మంది భారతీయులు మాల్దీవ్స్‌ని సందర్శించారు. ఈ సమయంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి భారత టూరిస్టులు కారణమయ్యారు. అయితే తాజాగా అధికారం చేపట్టిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల విధానాన్ని అవలంభిస్తుండటం భారత్‌కి కోపం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడి మంత్రులు ప్రధాని మోడీపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.