Building Collapse: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో సుమారు 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, విరార్‌లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్ట్‌మెంట్ భవనం 4వ అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలింది.. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చిన్న ఇళ్ల సముదాయంపై పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయి.
Read Also: Rajasthan: రాజస్థాన్‌లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఇక, రాత్రంతా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు 20 గంటలుగా తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకు రాగా.. గాయపడిన వారిని విరార్, నలసోపారాలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు.
Read Also: Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
అయితే, సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ‘అత్యంత ప్రమాదకరమైనది’గా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా 10 నుంచి 11 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఈ భవనాన్ని నిర్మించిన బిల్డర్ నితల్ గోపీనాథ్ సానేను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళిక చట్టం (MRTP) సెక్షన్లు 52, 53, 54తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసులు పెట్టారు పోలీసులు.
