Maharashtra Politics: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!

Congress Ncp

Congress Ncp

Maharashtra Politics: మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి (MVA) లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ.. అక్కడ ఊహించని రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP – SP) ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఇరు పార్టీల నేతల మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విలీన ప్రక్రియ గనుక కార్యరూపం దాల్చితే.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర స్థాయిలోనే ఏకాభిప్రాయ సాధన

ప్రస్తుతానికి ఈ విలీన చర్చలు ఇరు పార్టీల మహారాష్ట్ర రాష్ట్ర విభాగాల మధ్యే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ (ఎస్పీ) అధిష్ఠానం ముందుగా తమ పార్టీలోని అంతర్గత నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించి ఒక స్పష్టమైన ఏకాభిప్రాయానికి రావాలని ప్రయత్నిస్తోంది. అక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక స్థూల అవగాహన కుదిరిన తర్వాతే.. తర్వాత తుది నిర్ణయం కోసం ఢిల్లీలోని ఇరు పార్టీల హైకమాండ్‌ల ముందుకు ఈ ప్రతిపాదనను తీసుకెళ్లనున్నారట. నిజానికి 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విలీన అంశం చర్చకు వచ్చినప్పటికీ, అప్పట్లో ఎన్నికల ప్రచారం కారణంగా దీనిని హోల్డ్‌లో పెట్టారని సమాచారం.

మహా వికాస్ అఘాడీ (MVA) లో అసంతృప్తి

ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు, ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో ఈ సరికొత్త విలీన వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, ఎన్‌సీపీ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT) లతో కూడిన ఈ కూటమి.. ఎంపీల తిరుగుబాటుతో ఇప్పటికే కోలుకోలేని దెబ్బతింది. ఇటీవల ముంబైలో జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే బహిరంగంగానే తమ కూటమి ఐక్యతను ప్రశ్నిస్తూ.. “మనం కలిసి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ.. నిజంగానే మనం కలిసి ఉన్నామా?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

27 ఏళ్ల తర్వాత మళ్లీ..

1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన శరద్ పవార్.. సరిగ్గా 27 ఏళ్ల క్రితం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ని స్థాపించారు. అయితే 2023లో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పార్టీని చీల్చడంతో.. అసలైన పార్టీ పేరు, గుర్తు అజిత్ పవార్ వర్గానికి దక్కాయి. దీంతో శరద్ పవార్ ‘ఎన్‌సీపీ (శరద్ చంద్ర పవార్)’ పేరుతో కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు, పార్టీ మనుగడ కోసం శరద్ పవార్ మళ్లీ హస్తం గూటికి చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విలీన ప్రతిపాదనపై అధికారిక స్పష్టత వస్తే గనుక మహారాష్ట్రలో విపక్షాల బలం మరింత పెరిగే అవకాశం ఉంది.