మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బల నిరూపన చేసుకోవాలని ఆదేశించడంతో రాజకీయం రసవత్తంగా మారాయి. ఇప్పటికే గౌహతిలో ఉన్న శివసేన రెబెల్స్ గోవాకు వెళ్లనున్నారు. గోవా లోని తాజ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ లో రెబెల్ ఎమ్మెల్యేలకు 70 రూమ్ లు బుక్ చేసినట్లు సమాచారం. గురువారం ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో గోవా నుంచి నేరుగా రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు రానున్నారు.
ఇదిలా ఉంటే గవర్నర్ నిర్ణయంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ విషయాన్ని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కూడా స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని.. 16 మంది ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంలో ఉండగా ఫ్లోర్ టెస్ట్ కు ఎలా ఆదేశిస్తారని, గవర్నర్ ఈ సమయంలో కోసమే ఎదురుచూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర హోమంత్రి దిలీప్ వాల్సే పాటిల్, జయంత్ పాటిల్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి అత్యవసరంగా వెళ్లారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఇక బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలను ముంబై తాజ్ ప్రెసిడెంట్ హోటల్ కు రావాలని పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర బిజెపి ఆదేశించింది. ఏ కారణం చేత కూడా రేపటి ఫ్లోర్ టెస్ట్ వాయిదా వేయకూడదని గవర్నర్ కోష్యారీ, అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.
