ఇప్పుడే దేశవ్యాప్తం ప్రజలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. సభ్యులు వారివారి సీట్లలో కూర్చున్న తరువాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏ కారణం చేతనైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడం కుదరదు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు. జూన్ 30న ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో అసెంబ్లీ లోపల, బయట భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.
మహారాష్ట్రలో పార్టీ బలబలాలు:
అసెంబ్లీలో మొత్తం స్థానాలు: 288
మ్యాజిక్ ఫిగర్: 144
మహా వికాస్ అఘాడీ కూటమి:
శివసేన( ఉద్ధవ్ వర్గం): 16
ఎన్సీపీ: 53
కాంగ్రెస్: 44
బీజేపీ కూటమి:
బీజేపీ: 106
ఎంహెచ్ జేపీఎస్: 02
స్వతంత్రులు: 05
శివసేన( షిండేవర్గం): 39+07(స్వతంత్రులు)
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయని వరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)కి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఏక్ నాథ్ షిండే దాదాపు 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు 07 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో ఎంవీఏ కూటమి మైనారిటీలో పడింది.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం బీజేపీకి 106 ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలుపుకుని 113 మంది మద్దతు ఉంది. ఏక్ నాథ్ షిండే వర్గంలోని 39 మంది, స్వతంత్ర ఎమ్మెల్యేలు 07 మందిని మంది కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 144 మార్క్ దాటుతోంది. దీంతో అధికారం బీజేపీ చేజిక్కించుకునే అవకాశం ఉంది.
