Site icon NTV Telugu

Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.

Devendra Fadnavis, Koshyari

Devendra Fadnavis, Koshyari

మహారాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. బల పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సుప్రీం కోర్ట్ బలపరీక్షకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. దీంతో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది.

ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయింది. గవర్నర్, ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. తమకు 161 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఫడ్నవీస్ చెబుతున్నారు. మూడో సారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి గురువారం 11 గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్ కమిటీ సమావేవం అనంతరం ప్రెస్ మీట్ ఉండనుంది. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇటు బీజేపీ నేతలతో పాటు గోవాలో క్యాంప్ లో ఉన్న ఏక్ నాథ్ షిండేతో ఫోన్లో సంప్రదించనున్నారు ఫడ్నవీస్. గవర్నర్, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం ఆలస్యం అయితే తామే అతిపెద్ద పార్టీగా (106 ఎమ్మెల్యేలు) ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలపనున్నారు.

గోవా తాజ్ రిసార్ట్ లో ఉన్న షిండే క్యాంప్ ఎమ్మెల్యేలను కలిశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. గవర్నర్ కోషియారి, దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారం సమాయానికి రెబెల్ వర్గం ముంబై చేరుకోవాలని బీజేపీ తెలియజేసినట్లు సమాచారం. రెబెల్ వర్గం ఎమ్మెల్యేలు ముంబైకి వస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి.

ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ బలం చూస్తే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శివసేన రెబెల్ వర్గం 39 మందితో పాటు ఎంపీజేఎస్ పార్టీకి చెందిన 02 ఎమ్మెల్యేలు, స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని 18 మంది మద్దతు ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో రెబెల్ వర్గంలోని 10 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేసే అవకాశం ఉంది.

 

 

 

Exit mobile version